పోలవరానికి తొలిసారిగా ఎన్‌డీఎస్‌ఏ బృందం

ఆనకట్ట భద్రతపై క్షేత్రస్థాయి పరిశీలన.. నిర్మాణాల పనితీరుపై సమీక్ష

స్కాడా వ్యవస్థ, అత్యవసర కార్యాచరణ ప్రణాళికపై అధికారుల వివరణ

అమరావతి: పోలవరం ప్రాజెక్టును నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ప్రతినిధి బృందం తొలిసారిగా సందర్శించింది. ఆనకట్ట భద్రతకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, నిర్మాణ దశలో అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు, భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న పర్యవేక్షణ వ్యవస్థలపై శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను సందర్శించి జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది.ఎన్‌డీఎస్‌ఏ సదరన్‌ జోన్‌ డైరెక్టర్‌ గిరిధర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ హేమాదిత్య ఈ పర్యటనలో పాల్గొన్నారు.

ప్రాజెక్టు నిర్మాణాలపై ప్రజెంటేషన్‌

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న బృందానికి జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్టు నమూనా ద్వారా నిర్మాణ స్వరూపాన్ని వివరించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, వివిధ నిర్మాణాల ప్రస్తుత పరిస్థితి, మిగిలిన పనుల పురోగతిని తెలియజేశారు. అనంతరం సమావేశ మందిరంలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వహించారు. ప్రాజెక్టు సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ) పి.రామచంద్రరావు వివిధ విభాగాల్లో పనుల పురోగతిని గణాంకాలతో సహా వివరించారు.

పోలవరం వద్ద నిపుణుల బృందం

స్పిల్‌వే, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పరిశీలన

అనంతరం ఎన్‌డీఎస్‌ఏ బృందం స్పిల్‌వే, గ్యాప్‌-1, గ్యాప్‌-2, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ తదితర నిర్మాణ ప్రాంతాలను సందర్శించింది. ఆనకట్ట భద్రత కోసం నిర్మాణ దశ నుంచే తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది. వివిధ నిర్మాణాల వద్ద భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈ రామచంద్రరావు వివరించారు. వాటి పనితీరు, వాటి ద్వారా సేకరిస్తున్న సమాచారంపై ఎన్‌డీఎస్‌ఏ బృందం ఆరా తీసింది. ఈ వివరాలను అధికారులు ప్రజెంటేషన్‌ ద్వారా వెల్లడించారు.

స్కాడా వ్యవస్థతో నిరంతర పర్యవేక్షణ

ప్రాజెక్టు భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అత్యాధునిక సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌ (స్కాడా) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సెన్సార్లు, మీటర్లు, వాల్వులు తదితర పరికరాల నుంచి ఈ వ్యవస్థ రియల్‌టైమ్‌ డేటాను సేకరిస్తుందని వివరించారు. తద్వారా ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాల పనితీరు, భద్రతకు సంబంధించిన పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు.

ఐఐటీ రూర్కీతో అత్యవసర కార్యాచరణ ప్రణాళిక

ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఎమర్జెన్సీ యాక్షన్‌ ప్లాన్‌ (అత్యవసర కార్యాచరణ ప్రణాళిక)ను ఐఐటీ రూర్కీ రూపొందిస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రణాళిక పూర్తయిన వెంటనే ఎన్‌డీఎస్‌ఏకు అందజేస్తామని తెలిపారు.

భద్రతా చర్యలపై సంతృప్తి

ఆనకట్టల భద్రతా చట్టం-2021 ప్రకారం దేశంలోని ఆనకట్టల భద్రతకు సంబంధించి ఎన్‌డీఎస్‌ఏ సూచనలు, సలహాలు అందిస్తోంది. ఇప్పటివరకు నిర్మాణం పూర్తయిన ఆనకట్టలను పరిశీలిస్తున్న ఈ అథారిటీ, కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాల మేరకు నిర్మాణ దశలో ఉన్న పోలవరం ప్రాజెక్టును తొలిసారిగా సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.ప్రాజెక్టు భద్రత కోసం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులు ఇచ్చిన వివరణల పట్ల ఎన్‌డీఎస్‌ఏ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో ఈఈలు బాలకృష్ణ, శ్రీనివాస్‌, సుబ్రహ్మణ్యం, ఎల్‌.వి.రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్‌డీఎస్‌ఏ బృందం పర్యటన ఏర్పాట్లను ఎంఈఐఎల్‌ జీఎం ఏ.గంగాధర్‌, డీజీఎం మురళి పమ్మి పర్యవేక్షించారు.

పోలవం ప్రాజెక్ట్ నుపరిశీలిస్తున్న నిపుణుల బృందం
Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *