ఎరువుల కొనుగోలుకు ఎఫ్ ఎఫ్ఎస్ యాప్
- అమల్టోకి వచ్చిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్
- యాప్ ద్వారా ముందుగానే ఎరువుల బుకింగ్
- ప్రత్యేక క్యూఆర్ కోడ్, టోకెన్ నంబర్ జారీ
- యాప్ పనితీరు వివరించిన రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకుడు డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్
ఎరువుల పంపిణీ, విక్రయాల్లో పారదర్శకత పెంచడంతో పాటు రైతులకు కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ (ఎఫ్ఎఫ్ఎస్) విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో రైతులు ఎరువులను ముందుగానే యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ పూర్తయిన అనంతరం సంబంధిత దుకాణానికి ప్రత్యేక క్యూఆర్ కోడ్, టోకెన్ నంబర్ జారీ చేస్తారు. టోకెన్ పొందిన 48 గంటల్లోగా రైతులు ఎరువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీ లాస్య ఏజెన్సీస్‌లో మంగళవారం నూతన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ పనితీరు, ఎరువుల కొనుగోలు ప్రక్రియను రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకుడు డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, సొసైటీలు, ఎరువుల దుకాణాలు, రైతు సేవా కేంద్రాల సిబ్బందికి నూతన విధానంపై అవగాహన కల్పించారు. రైతులు సాగు చేస్తున్న భూముల విస్తీర్ణాన్ని యాప్‌లో పరిశీలించి, దానికి అనుగుణంగా ఎరువుల కేటాయింపు, క్యూఆర్ కోడ్ జారీ ప్రక్రియను తనిఖీ చేశారు.

యాప్ ద్వారా ముందస్తు బుకింగ్
ఎఫ్ఎఫ్ఎస్ విధానంలో ఎరువుల సిఫార్సు పరిమాణాల్లో ఎలాంటి మార్పులు ఉండవని డాక్టర్ మనజీర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా యూరియా, డీఏపీ ఎరువుల సిఫార్సుల్లో మార్పు ఉండదని, ఇతర ఎరువుల ఎంపికలో రైతులకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఆధార్ లేదా ఫార్మర్ ఐడీ (రైతు విశిష్ట సంఖ్య) ద్వారా నమోదు చేసుకున్న తర్వాత రైతులకు సంబంధించిన భూముల వివరాలు యాప్‌లో కనిపిస్తాయని వివరించారు. కొత్త విధానం ప్రకారం రైతులు తమకు అవసరమైన ఎరువులను ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ముందుగానే బుక్ చేసుకోవాలి. ఈ ప్రక్రియను రైతులు స్వయంగా చేసుకోవచ్చు. అవసరమైతే గ్రామ వ్యవసాయ సిబ్బంది సహాయం కూడా తీసుకోవచ్చు. బుకింగ్ పూర్తయిన తర్వాత ఎరువులు కొనుగోలు చేయాల్సిన దుకాణానికి సంబంధించిన ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో పాటు టోకెన్ నంబర్ జారీ అవుతుంది.
48 గంటల్లో కొనుగోలు తప్పనిసరి
టోకెన్ జారీ అయిన 48 గంటల్లోపు రైతులు ఎరువులను కొనుగోలు చేయాలి. నిర్దేశిత సమయంలో కొనుగోలు చేయకపోతే బుకింగ్ రద్దవుతుంది. ఎరువుల దుకాణానికి వెళ్లినప్పుడు రైతులు తమకు కేటాయించిన క్యూఆర్ కోడ్‌ను డీలర్‌కు అందించాలి. డీలర్ ఈ-పాస్ (e-POS) పరికరం ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేసి రైతులకు ఎరువులను పంపిణీ చేస్తారు. ఈ విధానం ద్వారా ఎరువుల విక్రయాలు, పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించవచ్చని వ్యవసాయశాఖ భావిస్తోంది.
ప్రతి దుకాణంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్
నూతన విధానంపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రతి ఎరువుల దుకాణంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని డాక్టర్ మనజీర్ సూచించారు. రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాల సిబ్బంది సూచనలు పాటిస్తూ ఎఫ్ఎఫ్ఎస్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయానికి చెందిన రాజన్, సహాయ వ్యవసాయ సంచాలకుడు శ్రీనివాసరావు, రైతులు, సొసైటీ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

