అక్వాన్ తుఫాను .. అంతటా అప్రమత్తం

రైతులు, మత్స్యకారుల రక్షణకు చర్యలు

23.87 లక్షల హెక్టార్ల పంటలపై ప్రత్యేక దృష్టి.. సముద్రంలో 173 బోట్లపై పర్యవేక్షణ

అమరావతి, నవంబర్ 16: అక్వాన్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు, మత్స్యకారుల రక్షణకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని, పంట నష్టాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

23.87 లక్షల హెక్టార్ల పంటలపై దృష్టి

రాష్ట్రంలో ఖరీఫ్, రబీ కలిపి 23.87 లక్షల హెక్టార్లలో పంటలు సాగులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇందులో 13.60 లక్షల హెక్టార్లలో వరి, 4.42 లక్షల హెక్టార్లలో కంది, 1.92 లక్షల హెక్టార్లలో పత్తి పంటలు ఉన్నాయి. తీరప్రాంతంలోని 10 జిల్లాల్లో 9.51 లక్షల హెక్టార్ల పంటలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను ముందుగానే సేకరించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా కాలువలను శుభ్రం చేయాలని సూచించారు.

ఆక్వా తుపాన్ పై అప్రమత్తం చేసిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

పంటలకు ముందస్తు రక్షణ

తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్న 16 జిల్లాల్లో 2.69 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో 1.08 లక్షల హెక్టార్ల మిరప, 98,526 హెక్టార్ల కొబ్బరి, 24,469 హెక్టార్ల పసుపు పంటలు ఉన్నాయి. అరటి, బొప్పాయి మొక్కలకు ఊతం ఏర్పాటు చేయాలని, కోతకు సిద్ధమైన పంటలను ముందుగానే మార్కెట్లకు తరలించాలని మంత్రి సూచించారు. పల్నాడు, కోనసీమ, మార్కాపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

173 బోట్లపై నిరంతర పర్యవేక్షణ

రాష్ట్రంలోని 30,808 బోట్లలో నవంబర్ 16 ఉదయం 10 గంటల నాటికి 30,635 బోట్లు సురక్షితంగా తీరానికి చేరాయని మంత్రి తెలిపారు. సముద్రంలో మిగిలిన 173 బోట్లను కూడా క్షేమంగా తీరానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మత్స్యకారులకు ఇప్పటికే 1,08,250 వాయిస్ హెచ్చరికలు పంపించామని, 8,217 బోట్లను నాభిమిత్ర వ్యవస్థ ద్వారా ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. 555 మత్స్యకార గ్రామాలు, 350 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

ఆక్వా రైతులకు సూచనలు

తుఫాను సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని మంత్రి సూచించారు. ఆక్వా రైతులు చెరువుల గట్లను బలోపేతం చేసుకోవాలని, నీటిలో ఆక్సిజన్, పీహెచ్, లవణీయత స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. బోట్లు, వలలు, విద్యుత్ పరికరాలను సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు.

నష్టాలపై 24 గంటల్లో ప్రాథమిక నివేదికలు

తుఫాను కారణంగా ఉద్యాన పంటలకు నష్టం జరిగితే 24 గంటల్లో ప్రాథమిక నివేదికలు, వారం రోజుల్లో రైతులవారీగా పూర్తి వివరాలు అందించాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయ పంటల నష్టాలను రెవెన్యూ శాఖతో కలిసి అంచనా వేయాలని, 33 శాతానికి మించి నష్టం జరిగిన పంటలకు నిబంధనల ప్రకారం ఇన్‌పుట్ సబ్సిడీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు 155251 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా అందించాలని తెలిపారు. తుఫాను పరిస్థితులపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి స్పష్టం చేశారు.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *