Literature

నా ఒంగోలు బాల్యం .. వసివాడని కావ్యం

కుర్రా ప్రసాద్ బాబు 9440660988

ఒంగోలు నగరం
రాజాపానగల్ రోడ్డు ఆరవ లైనులో
ఊపిరి పోసుకున్న నాకు
గోరంట్ల వేంకన్న సంస్కృతోన్నత పాఠశాల ప్రాంగణంలో
లేత వేపచిగురుతో సంస్కృతాంధ్ర భాషల తియ్యదనాన్ని
అలవోకగా నేర్పించి…
నిత్యం నుదుట తిలక ధారణతో దర్శనమిచ్చే..
గురుదేవుల పాదపద్మాలకు
సాష్టాంగ ప్రణామాలర్పించే
ఆ మధుర దృశ్యాలు
నా మస్తిష్కంలో కదలాడుతూనే వున్నాయి
వీధుల కోలాహలం ..
శ్రమజీవుల స్వేద సుగంధం
కోడికూసి తెల్లారేలోపు ..
గంపల నిండా కూరగాయలతో
వీణలో ఏకరువు పెట్టే సంగీత స్వరాల్లా
ఆకుకూరల కేకలు.. చిలగడ దుంపలు..
ఉప్పుబండ్లతో ఎద్దుల గజ్జెల చప్పుడుకి
మా వీధి అంతా ఒక ఉత్సవంలా మారే ..
ఆహ్లాదకర సన్నివేశాలు
శరీరం అలసేదాకా ఆటల నిశి సంధ్య…
బడిగంట మోగి ఇంటికి రాగానే..
ఆకలి మంటల నడుమ
ఆత్మీయంగా తిన్న కారప్పూసో..
అరిసె ముక్కో ఇచ్చే తృప్తి..
వెంటనే నాలుగు గ్లాసుల చల్లని నీళ్లు
చటుక్కున తాగి అమ్మో! ఆటల్లోకి ఉరికితే..
పశువులు ఇళ్లకు చేరేదాకా విశ్రాంతే లేదు
గోలీలు.. బొంగరాలు.. బిళ్లంగోడు
కోతిక్కొమ్మచ్చి.. వంగుళ్లు దూకూళ్లుతో
ఆకలిదప్పులు లేవు…
అలసట అసలే తెలియదు
కాళ్ల పరుగుల చప్పుళ్లు వినని వీధులంటూ లేవు

మా
రంగరాయడు చెరువు దాహార్తి తీర్చిన తీరు..
సైకిల్ సీటు వెనుక రాగిబిందెల నీళ్ల మోతలు
ఆంధ్రకేసరి విద్యాలయం నేర్పిన క్రమశిక్షణ
మంగమ్మ కళాశాల నేర్పిన పోరాట పటిమ
పండుగల హంగామా…
దీపావళి పండుగొస్తే ..
తెల్లవార్లు ఊరేగే శ్రీకృష్ణుడు-
నరకాసురుల బండ్ల వెంట తిరుగుతూ
గాంధీరోడ్డులో జరిగే యుద్ధంలోసంధించుకునే
‘బాణాలు’ చేజిక్కుంచుకునేందుకు
మేము చేసిన యుద్దాలు… మరపురాని ఘట్టాలు.
విజయదశమికి కళారాల సంబరాలలో
కనక తప్పెట్ల దరువుల నడుమ..
మా కళాత్మక నాట్యవిన్యాసాలు
సంక్రాంతి భోగిమంటల్లో
చలికాచుకున్న వెచ్చని వేకువలు
నా బాల్యానికి పట్టిన బంగారు రంగులు
ఎవరింట్లో మంచి చెడులు సంభవించినా..
సుఖదుఖాలను, కష్టనష్టాలను
స్వంత ఇంటిపనిలా పంచుకున్న
ఆనాటి మనసున్న మానవతామూర్తులు…
కాలంతో పాటు బంధాలు కరిగిపోయి…
స్వార్థం పెరిగిన ఈ రోజుల్లో..
కల్మషం లేని హృదయాల కోసం
వేయి కళ్లతో వెదకాల్సి వస్తోంది
కళ్ల ముందు కదలాడే
ఆ నిస్వార్థ ప్రేమలను తలచుకుంటూ..
నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను
“ఓ భగవంతుడా!
ఈ యాంత్రిక నాగరికత నాకు వద్దు ..
నా అమాయకపు, అనురాగాల
నా ఒంగోలు బంగారు బాల్యాన్ని నాకివ్వు!”
అంటూ నా మనసు ఆక్రోశిస్తూ నిన్ను.. వేడుకుంటోంది!

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *