ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీశాఖ మెరుపు దాడులు
114 ఎర్రచందనం దుంగలు, ఏడు వాహనాలు స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
మగ్లింగ్‌కు అన్ని దారులూ మూసుకుపోవాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో చేపట్టిన దాడుల్లో 114 ఎర్రచందనం దుంగలు, ఏడు వాహనాలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అటవీశాఖ అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు.
అంబులెన్స్‌లు, కార్లలో తరలింపు
టాస్క్‌ఫోర్స్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు పలు మార్గాల్లో తనిఖీలు, గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా అంబులెన్స్‌లు, కార్లలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను గుర్తించారు. నిందితుల నుంచి ఒక స్విఫ్ట్ డిజైర్, రెండు ఇన్నోవా కార్లు, రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం, ఒక అంబులెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
స్మగ్లింగ్ మూలాలపై దర్యాప్తు
ఎర్రచందనం స్మగ్లర్లు దుంగల వైపు చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు ఉండాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. తప్పించుకున్న ఇతర నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని, అక్రమ రవాణా వెనుక ఉన్న మూలాలను వెలికితీసేలా దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


