కాకినాడ హార్బర్‌కు సురక్షితంగా చేరిన మత్స్యకారుల బోటు

ఇంజిన్ వైఫల్యంతో సముద్రంలో నిలిచిన బోటు.. ఏడుగురు మత్స్యకారులు క్షేమం

ఉప్పాడకు చెందిన మరో ఏడుగురి కోసం ముమ్మరంగా గాలింపు

బంగ్లాదేశ్, మయన్మార్ సహకారం కోరేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

మత్స్యకారుల ప్రాణరక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం: మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి, నవంబర్ 25: సముద్రంలో ఇంజిన్ వైఫల్యంతో నిలిచిపోయిన మత్స్యకారుల బోటు సురక్షితంగా కాకినాడ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుంది. బోటులో ఉన్న డ్రైవర్‌తో సహా ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావడంతో వారి కుటుంబ సభ్యులకు ఊరట లభించింది. మరోవైపు ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

కాకినాడ జిల్లా యేటిమొగ నుంచి చేపల వేటకు వెళ్లిన సెరు రామలక్ష్మి పేరుతో నమోదైన యాంత్రిక మత్స్యకార బోటు (IND-AP-E2-MM-220) ఈ నెల 23వ తేదీ రాత్రి ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఉప్పాడ–తుని తీరంలోని కృష్ణాపురం సమీపంలో నిలిచిపోయింది. తీరానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయిన బోటు నుంచి డ్రైవర్ దమ్ము అప్పారావు అధికారులకు సమాచారం అందించారు.

మత్స్యకారుల ఆచూకి వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

అత్యవసర సమాచారం అందిన వెంటనే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలోనూ వాకలపూడి ఇన్‌స్పెక్టర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోస్ట్‌గార్డ్, నౌకాదళ అధికారులకు సమాచారం అందించడంతో పాటు మత్స్యశాఖతో సమన్వయం చేసుకున్నారు. సముద్రంలో నీటి లోతు తక్కువగా ఉండటంతో భారీ నౌకల రాకకు ఇబ్బందులు ఎదురైనా, బోట్ల యజమానుల సంఘం సహకారంతో సహాయక చర్యలు కొనసాగించారు.

సకాలంలో స్పందించి మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడంలో కృషి చేసిన కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు, ఇతర సిబ్బందిని మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

గల్లంతైన ఏడుగురి కోసం ముమ్మర గాలింపు

కాకినాడ జిల్లా ఉప్పాడలోని సుబ్బంపేటకు చెందిన మరో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 4వ తేదీన రెండు బోట్లలో పారాదీప్ వైపు చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల్లో ఒక బోటు ఈ నెల 18న తిరిగి వచ్చింది. మరో బోటులోని ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ తెలియకపోవడంతో 19వ తేదీన ఫిర్యాదు అందింది. అప్పటి నుంచి సంబంధిత శాఖల సమన్వయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. అవసరమైన సహకారం అందించాలని కోరడంతో పాటు, వారు బంగ్లాదేశ్ లేదా మయన్మార్ సముద్ర జలాల పరిధిలోకి వెళ్లి ఉండే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా ఆయా దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

భారత తీర రక్షక దళం, నౌకాదళం, ఒడిశా అధికారులు, రాష్ట్ర మత్స్యశాఖ సమన్వయంతో గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.

బోట్లలో రక్షణ పరికరాల తనిఖీ తప్పనిసరి

చేపల వేటకు సముద్రంలోకి వెళ్లే ముందు బోట్ల ఇంజిన్లు, ట్రాన్స్‌పాండర్లు, సమాచార వ్యవస్థలు, ఇతర రక్షణ పరికరాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని మంత్రి మత్స్యకారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు తక్షణమే స్పందించేలా అవసరమైన అప్రమత్తత ఉండాలని స్పష్టం చేశారు.

మత్స్యకారుల ప్రాణరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని అచ్చెన్నాయుడు తెలిపారు. ఒక బోటులోని ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావడం సంతోషకరమని, గల్లంతైన మరో ఏడుగురిని కూడా సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *