రాయలసీమ నీటి హక్కుల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ అవసరమా?

రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి

కృష్ణా డెల్టా ప్రయోజనాలపై రాజకీయ పార్టీల స్పందన.. రాయలసీమ విషయంలో ఎందుకు మౌనం?

శ్రీశైలం జలాశయం నీటి నిర్వహణపై ప్రజాప్రతినిధులు ప్రశ్నించాలి

ఒక ప్రాంతం తన నీటి అవసరాల కోసం రాజకీయంగా గొంతెత్తగలుగుతున్నప్పుడు, రాయలసీమకు ఆ రాజకీయ గొంతుక ఎందుకు కొరవడిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాంత సాగునీటి, తాగునీటి హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరాన్ని పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.

కృష్ణా డెల్టాకు నీటి అవసరాలు.. రాయలసీమ సంగతేమిటి?

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించడం, పులిచింతలలో నీటి నిల్వలు అందుబాటులో ఉండటం వల్ల ఆ ప్రాంతానికి కొంత ఉపశమనం లభించిందన్నారు.

అయితే శ్రీశైలం జలాశయానికి చేరుతున్న నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు విడుదల చేస్తుండటంతో రాయలసీమ తాగునీటి, సాగునీటి అవసరాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జలాశయంలో నీటి నిర్వహణపై ప్రజాప్రతినిధులు సమగ్రంగా ప్రశ్నించడం లేదని విమర్శించారు.

శ్రీశైలం నీటి నిర్వహణపై రాజకీయ మౌనం

జలాశయంలో నీటి నిల్వలు తగ్గిన తర్వాతే ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు నీటి విడుదల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ఒక ప్రాంతానికి విడుదలైన నీటిని మరో ప్రాంతానికి మళ్లించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

శ్రీశైలం నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, సాధ్యమైన మేరకు సాగునీటికి వినియోగించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కోరారు. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు గట్టిగా స్పందించాలని సూచించారు.

తుంగభద్ర జలాల వినియోగంపై ప్రశ్నలు

కృష్ణా డెల్టాకు 10 టీఎంసీల నీటిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశంలో ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయని రామిరెడ్డి ప్రస్తావించారు. అదే సమయంలో కృష్ణా డెల్టా నీటి అవసరాలపై రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారని పేర్కొన్నారు.

మరి తుంగభద్రలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రాయలసీమ ఆయకట్టుకు అవసరమైన నీటిని ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. సుమారు 90 లక్షల ఎకరాల సాగుకు అనువైన భూమి ఉన్న రాయలసీమలో కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు వరి సాగును వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ పంటకు కనీసం ఒక్క తడి నీరైనా అందించగలమా, ప్రజల తాగునీటి అవసరాలను ఎలా తీర్చాలనే దానిపై పాలకులు దృష్టి పెట్టాలని కోరారు.

రాయలసీమ హక్కుల కోసం ప్రత్యేక రాజకీయ వేదిక

కృష్ణా డెల్టా రైతుల సాగునీటి సమస్యలపై స్పందించడం తప్పు కాదని, అదే స్థాయిలో రాయలసీమ నీటి హక్కులపైనా రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మారుతున్నా రాయలసీమ నీటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు.

ఈ నేపథ్యంలో రాయలసీమ సమగ్ర అభివృద్ధి, సాగునీటి హక్కులు, తాగునీటి భద్రత, ప్రాంతీయ ఆత్మగౌరవం, రాజకీయ అస్తిత్వం కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరంపై విస్తృత చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ, రాజకీయ పార్టీలను నిలదీస్తూ రాయలసీమ సమాజం తన హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరంపై రాయలసీమ ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరారు.

Share this:
andhraprdeshrayalaseema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *