ఉండవల్లిలో ఓటేసిన చంద్రబాబు కుటుంబం
భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణితో కలిసి ఉండవల్లికి వచ్చిన సీఎం
ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది
డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికలు జరగాలి
మంగళగిరి-తాడేపల్లి: నవంబరు 26 : ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బాధ్యత కలిగిన పౌరులుగా ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఉండవల్లిలోని ఎంపీయూపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి నారా లోకేష్, కుటుంబ సభ్యులు కూడా ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతను వివరించారు.

ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే పాలకులను ప్రశ్నించే హక్కు ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు ఉండాలని ఆకాంక్షించారు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత బలమైనదని, దేశం మరింత అభివృద్ధి చెందాలంటే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేసిందన్నారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తిని రాజ్యాంగం అందించిందని పేర్కొన్నారు.రాష్ట్రంలో తొలిదశలో భాగంగా 23 మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

