ఈసీఆర్‌ఎఫ్‌ పనుల నాణ్యతపై పీపీఏ సీఈఓ క్షేత్రస్థాయి పరిశీలన

పోలవరంలో మూడు గంటల పాటు పర్యటన..

మట్టి, రాయి నింపకం, పటిష్ఠతపై పరీక్షలు

నాణ్యతలో రాజీ వద్దని అధికారులకు సూచన..

సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ నిపుణుల పరీక్షలు సంతృప్తికరం

అమరావతి: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణ పనుల నాణ్యతను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ సంజీవ్‌ వోహ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గురువారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సుమారు మూడు గంటల పాటు పర్యటించి, మట్టి, రాయి నింపకం, వాటి పటిష్ఠతను తనిఖీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. కేంద్ర మృత్తిక, పదార్థాల పరిశోధన కేంద్రం (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణులు కూడా ఈ పరిశీలనలో పాల్గొన్నారు.

కిలోమీటరున్నర మేర కాలినడకన పరిశీలన

ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో సుమారు కిలోమీటరున్నర మేర కాలినడకన తిరిగిన పీపీఏ సీఈఓ వివిధ దశల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. మట్టి, రాయి, ఇసుకను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నింపుతున్నారా? అనే అంశాలపై అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆరా తీశారు. నిర్మాణంలోని ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మట్టి, రాయి పొరల మధ్య ఖాళీలు లేకుండా పటిష్ఠంగా నింపాలని సూచించారు.

అప్పటికప్పుడు పటిష్ఠత పరీక్షలు

నిర్మాణ నాణ్యతను నిర్ధారించేందుకు కొన్ని ప్రాంతాల్లో జేసీబీతో సుమారు ఒక మీటరు లోతు వరకు తవ్వించి లోపలి పొరల గట్టిదనాన్ని పరిశీలించారు. అనంతరం తొలగించిన మట్టిని తిరిగి నింపి షీప్‌ఫుట్‌ రోలర్‌తో చదును చేయించారు. గతంలో ఉన్న పటిష్ఠతకు, తిరిగి నింపిన తర్వాత ఏర్పడిన గట్టిదనానికి మధ్య వ్యత్యాసాన్ని పరీక్షించారు. గట్టిదనంలో తేడా కనిపించకపోవడంతో సీఈఓ సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఊట, తేమ శాతం గుర్తించే పరికరాల తనిఖీ

భూగర్భ జలాల ఊట, మట్టిలో తేమ శాతాన్ని గుర్తించేందుకు దిగువ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరికరాల పనితీరును కూడా సంజీవ్‌ వోహ్రా పరిశీలించారు. వాటి ద్వారా అవసరమైన సమాచారం అందుతోందా? సక్రమంగా పనిచేస్తున్నాయా? అని సాంకేతిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

మూడు రోజులుగా సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ పరీక్షలు

మరోవైపు సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు హరీంద్ర ప్రకాశ్‌, శ్రీహరి టి. నాయర్‌, అమిత్‌ సేన్‌ మూడు రోజులుగా ప్రాజెక్టు ప్రాంతంలో వివిధ పరీక్షలు నిర్వహించారు. పైడిపాక, గ్యాప్‌-3 ప్రాంతాల్లో భవిష్యత్తు నిర్మాణ అవసరాల కోసం నిల్వ చేసిన మట్టి నాణ్యతను పరిశీలించారు. నిర్మాణానికి అనువైన ప్రమాణాలు ఉన్నాయా అనే అంశాన్ని పరీక్షించి, మరింత విశ్లేషణ కోసం కొన్ని నమూనాలను పరిశోధనా కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ పరీక్షలు సంతృప్తికరంగా సాగాయని సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ నిపుణులు వెల్లడించారు. పీపీఏ సీఈఓ క్షేత్రస్థాయి పరిశీలన, కేంద్ర నిపుణుల పరీక్షలతో ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ నాణ్యతపై నిరంతర పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమైంది. ఈ పర్యటనలో పీపీఏ సభ్య కార్యదర్శి ఎం. రఘురామ్‌, చీఫ్‌ ఇంజినీర్‌ ఎం. రమేష్‌కుమార్‌, జలవనరుల శాఖ, నాణ్యత నియంత్రణ విభాగాల అధికారులు, ఎంఈఐఎల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *