ap news

పవన్ కళ్యాణ్ కు భారీ స్వాగతం

సాగర తీరంలో పోటెత్తిన అభిమాన సంద్రం

ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి – జనసేన పార్టీ భరోసా కార్యక్రమంతో పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అధినేతను పుష్పగుచ్ఛాలతో సత్కరించగా, వీర మహిళలు హారతులు పట్టి ఆహ్వానించారు. భారీ స్థాయిలో విమానాశ్రయానికి జనసైనికుల రాకతో మధ్యాహ్నానికే విమానాశ్రయం ఆవరణ కిక్కిరిసిపోయింది. విమానాశ్రయ లాంజ్ నుంచి పవన్ కళ్యాణ్ బయటకు రావడానికే సుమారు అర గంటకు పైగా సమయం పట్టింది. అనంతరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా పవన్ తాను బస చేయనున్న బీచ్ రోడ్డులోని నోవాటెల్ హోటల్ కు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. జనసేనానికి స్వాగతం పలికిన వారిలో పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, ముత్తా శశిధర్, పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శులు టి. శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, పాలవలస యశస్వి, చిలకం మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస యాదవ్, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, అధికార ప్రతినిధులు సుందరపు విజయ్ కుమార్, పరుచూరి భాస్కరరావు, పార్టీ నేతలు వంపూరి గంగులయ్య, పీవీఎస్ఎన్ రాజు, సందీప్ పంచకర్ల, పసుపులేటి ఉషాకిరణ్, గడసాల అప్పారావు, డాక్టర్ బొడ్డేపల్లి రఘు, పొలసపల్లి సరోజ, బోడపాటి శివదత్, సీహెచ్ కిరణ్, కొత్తపల్లి త్రివేణి, ఎం. నాగలక్ష్మి, ఆదిమూలం శరణిదేవి, జీవీఎంసీ కార్పోరేటర్లు భీశెట్టి వసంతలక్ష్మి, పీతల మూర్తియాదవ్, దల్లి గోవిందరెడ్డి, శెట్టిబతుల రాజబాబు, పెడాడ రామ్మోహన్, నయుబ్ కమల్ తదితరులు ఉన్నారు.


ప్రత్యేక ఆకర్షణగా తప్పెటగుళ్లు, థింసా నృత్యం
ఉత్తరాంధ్ర కళలకు ప్రతీకగా నిలిచే తప్పెటగుళ్లు, గిరిజన సంప్రదాయ థింసా నృత్యాలతోపాటు కోలాటం, డప్పు నృత్యాలతో పవన్ కళ్యాణ్ కు అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. వేలాది మంది యువకులు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెంట సాగారు. రోడ్లకు ఇరువైపులా జనసేన శ్రేణులు, ప్రజలు పూలవర్షం కురిపించారు. ఆడపడుచులు హారతులు పట్టారు. సాగర నగరం జనసేన నినాదాలతో హోరెత్తింది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *