నరసరావుపేట హోటళ్ళలో తనిఖీలు
అపరిశుభ్ర వంటశాలలపై చర్యలు..
44 కిలోల లేబుల్ లేని ఆహార పదార్థాలు స్వాధీనం
అనుమతి లేకుండా నడుపుతున్న హోటల్‌పై కేసు..
వంటశాలలు మూసివేత
నరసరావుపేట,ఆంధ్రావని న్యూస్ : పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఆహార భద్రత డైరెక్టర్ పి. అరుణ్‌బాబు ఆధ్వర్యంలో బుధవారం పలు హోటళ్లు, రెస్టారెంట్లలో వరుస తనిఖీలు నిర్వహించారు. వంటశాలల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, హోటళ్ల అనుమతులను పరిశీలించారు. నిబంధనలు పాటించని హోటళ్లపై కేసులు నమోదు చేయడంతో పాటు, అపరిశుభ్రంగా ఉన్న వంటశాలలను మూసివేశారు. లేబుల్ లేని 44 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 20 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. పలు ఆహార పదార్థాల నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలలకు పంపించారు.
ఆర్కే రెస్టారెంట్‌లో 44 కిలోల ఆహారం స్వాధీనం
గుంటూరు జోన్ పరిధిలోని ఆర్కే రెస్టారెంట్‌ను తనిఖీ చేయగా వంటశాల అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వంటశాలను మూసివేశారు. లేబుల్ లేని 44 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సెనగపప్పు, కందిపప్పు నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.
జూపల్లి స్పైసెస్‌పై కేసు
జూపల్లి స్పైసెస్ హోటల్ వంటశాలలోని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను ధ్వంసం చేసి కేసు నమోదు చేశారు. వంటకు ఉపయోగిస్తున్న నూనె రీడింగ్ 33గా రావడంతో కేసు నమోదు చేశారు. మూడు రకాల ఆహార పదార్థాల నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.

అనుమతి లేకుండా నడుపుతున్న హోటల్‌పై కేసు
వినుకొండ రోడ్డులోని యునిక్యూ హోటల్‌ను తనిఖీ చేయగా అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేశారు. వంటశాలలోని ఫ్రిజ్‌లలో నిల్వ ఉన్న 20 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న వంటశాలను కూడా మూసివేశారు.
ఏకే బిర్యానీ పాయింట్‌కు నోటీసు
ఏకే బిర్యానీ పాయింట్‌ను తనిఖీ చేయగా వంటశాల అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో చర్యలు తీసుకోవాలని నోటీసు ఇచ్చారు. వంటకు ఉపయోగిస్తున్న నూనె రీడింగ్ 26.5గా రావడంతో నోటీసు జారీ చేశారు.
షాజ్ బిర్యానీ పాయింట్‌పై చర్యలు
షాజ్ బిర్యానీ పాయింట్ వంటశాలను తనిఖీ చేయగా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వంటశాలను మూసివేశారు. బిర్యానీ నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.
హెచ్6 రెస్టారెంట్‌పై కేసు
పల్నాడు బస్టాండ్ రోడ్డులోని హెచ్6 రెస్టారెంట్‌ను తనిఖీ చేయగా వంటశాల అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో చర్యలు తీసుకోవాలని నోటీసు ఇచ్చారు. వంటకు ఉపయోగిస్తున్న నూనె రీడింగ్ 33.5గా రావడంతో కేసు నమోదు చేశారు.
ఈ తనిఖీల్లో ఆహార భద్రత సంయుక్త నియంత్రణాధికారి బి. శ్రీనివాస్, గుంటూరు జిల్లా సహాయ ఆహార నియంత్రణాధికారి ఎన్. పూర్ణచంద్రరావు, ఆహార తనిఖీ అధికారులు సుబ్బారావు, వెంకటేశ్వర్లు, నర్సింహుడు పాల్గొన్నారు.

