ఏపీలో రేపు 100 పట్టణ స్థానిక సంస్థల తొలి సమావేశాలు
డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నిక కూడా..
విజయవాడ: రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నూతన పాలకవర్గాల తొలి సమావేశాలు నవంబర్ 23న నిర్వహించనున్నారు. అదే రోజు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయి.తొలి సమావేశంలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు, వార్డు సభ్యులు చట్ట ప్రకారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ చేపడతారు. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, మున్సిపాలిటీల చట్టాల ప్రకారం నూతన సభ్యుల ఐదేళ్ల పదవీకాలం తొలి సమావేశం తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దీంతో నవంబర్ 23 నుంచి రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో కొత్త పాలకవర్గాల పదవీకాలం ప్రారంభం కానుంది. సమావేశాలు, ప్రమాణ స్వీకారం, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత కమిషనర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

