ప్రజలు విజ్ఞతతో ఓటేశారు
స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ మెజార్టీ ఇచ్చారు
అభ్యర్ధి, పార్టీ గుణగుణాలను బేరీజు వేసుకుని ఎన్నుకున్నారు
ఎన్నికలు సాఫీగా సాగాయి..వైసీపీ ఆరోపణల్లో అర్ధం లేదు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
స్థానిక ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మంచి అభ్యర్థులకు ఓటేశారని తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూస్తాం. అదే విధంగా ప్రజలు అభ్యర్థి, పార్టీ గుణగుణాలను విశ్లేషించుకుని ఈ ఎన్నికల్లో ఓటేశారని అన్నారు. ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగినా… వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేసింది. కుప్పంలో కూడా ఓ ఎంపీటీసీ స్థానాన్ని కొల్పోయాం… మేమేం పంతానికి పోలేదు.ఆ ఎంపీటీసీ స్థానాన్ని బలవంతంగా కైవైసం చేసుకునేందుకు తాము వేరే విధానాలను అవలంబించ లేదన్నారు. స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేస్తేనే ప్రజాభిప్రాయం తెలుసుకోవచ్చని భావించాం..ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ఆలోచన ఇదే విధంగా ఉంటుంది… నమ్మకం లేని వాళ్లే కుట్రలకు పాల్పడతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
• జనాభా ప్రాతినిధ్య ప్రకారం వివిధ వర్గాలను మేం గెలిపించుకున్నాం.
• కనీస రాజకీయ నేపథ్యం లేనివారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారు.
• ఈసారి రాజకీయాల్లో కూటమి ఓ ట్రెండ్ సెట్ చేసింది.
• జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇచ్చాం. ప్రజల మద్దతు వారికే లభించింది.
• కూటమిగా 3 పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకోవడానికి విస్తృత కసరత్తు చేశాం.
• ఐక్యంగా మూడు పార్టీలు సమన్వయంతోనే ముందుకు వెళ్లాం.
• త్యాగాలు చేసిన కేడర్ కు, లీడర్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారందరినీ గుర్తిస్తాం, గౌరవిస్తాం.
• కూటమి ధర్మాన్ని పాటించి అంతా ముందుకు తీసుకెళ్లాలని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం.
• ప్రజలు కూటమి ప్రభుత్వ కష్టాన్ని గుర్తించారు. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా కనిపించింది.
• పెత్తందార్లం కాదు ప్రజా సేవకులుగా పనిచేస్తున్నామని పదేపదే చెబుతున్నాం.
• మెజారిటీ పెరిగితే మరింత జాగ్రత్తగా ఉండాలి.

