కూటమికి పెరిగిన ఓట్ల శాతం

2024తో పోలిస్తే కూటమి ఓట్ల శాతం 3.6 శాతం పెరిగింది
7 జిల్లాల్లో జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి ఆధిక్యం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓట్ల శాతం పెరిగిందని తెలిపారు. పట్టణ, పరిషత్ ఎన్నికలను కలిపి కూటమి 58.9 శాతం ఓట్లు సాధించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 33.56 శాతం ఓట్లు వచ్చాయని వివరించారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 55.3 శాతం ఓట్లు రాగా, తాజా స్థానిక ఎన్నికల్లో 3.6 శాతం పెరిగినట్లు చెప్పారు. అదే సమయంలో వైసీపీ ఓట్ల శాతం 39.81 నుంచి 33.56కు తగ్గిందని, 6.25 శాతం మేర తగ్గుదల నమోదైందని వెల్లడించారు. మొత్తంగా కూటమి, వైసీపీ మధ్య ఓట్ల శాతంలో 25.34 శాతం వ్యత్యాసం ఉందన్నారు.

పట్టణాల్లో 94 శాతం స్ట్రైక్‌రేట్

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 59.9 శాతం ఓట్లు, వైసీపీకి 34.3 శాతం ఓట్లు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. పట్టణాల్లో కూటమి స్ట్రైక్‌రేట్ 94 శాతంగా ఉందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి 57.6 శాతం, వైసీపీకి 39.7 శాతం ఓట్లు వచ్చాయని, కూటమి స్ట్రైక్‌రేట్ 87.5 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూటమి, వైసీపీ మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం 25.60 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 17.9 శాతంగా ఉందని వివరించారు.

9,818 ఎంపీటీసీ స్థానాల్లో 7,803 కూటమి ఖాతాలోకి

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,818 ఎంపీటీసీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 7,803 స్థానాలను గెలుచుకుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని సుమారు 90 శాతం మండల అధ్యక్ష స్థానాలను కూటమి దక్కించుకునే అవకాశం ఉందన్నారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి 65.7 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా, వైసీపీకి 27.42 శాతం వచ్చాయని తెలిపారు. పరిషత్ ఎన్నికల్లో ఎన్డీఏకు 62.83 శాతం, వైసీపీకి 31.46 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయని చెప్పారు.

28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి ఆధిక్యం

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలకు గాను కూటమి 575 స్థానాలను కైవసం చేసుకుందని చంద్రబాబు వెల్లడించారు. మొత్తం 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి ఆధిక్యత సాధించిందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైసీపీ కూటమి కంటే ఎక్కువ జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో వైసీపీకి ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదని చెప్పారు. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వైసీపీ ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిందని సీఎం వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో నమోదైన ఓట్ల శాతం, స్థానాల వారీగా వచ్చిన ఫలితాలను చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *