నష్టపరిహారం కౌలు రైతులకు ఇవ్వాలి
తుఫాను నష్టపరిహారం వాస్తవ సాగుదారులైన కౌలురైతులకే చెల్లించాలి
క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ నిర్వహించి కౌలురైతులను గుర్తించాలి
ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా పరిహారాన్ని తక్షణమే అందించాలి
ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య డిమాండ్
అర్నబ్, మురసు తుఫానుల ప్రభావంతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులు, కౌలురైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య డిమాండ్ చేశారు. పెరిగిన సాగు పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని వరిపంటకు ఎకరానికి కనీసం రూ.50 వేల ఇన్‌పుట్ సబ్సిడీ అర్హులైన రైతులకు, కౌలురైతులకు తక్షణమే అందించాలని కోరారు. రెండు తుఫానుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిని వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
శనివారం (నవంబర్ 14, 2026) ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, పశ్చిమగోదావరి జిల్లా సీపీఐ కార్యదర్శి కోనాల భీమారావు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. ఆనంద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కలిశెట్టి వెంకటరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు, చేతివృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సీతారాం ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తామరెని శ్రీనివాస్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం భీమవరం రూరల్, పాలకొల్లు, వీరవాసరం మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించింది. తుఫానుల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులను పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంది.
80 శాతం దెబ్బతిన్న పంటలు
ఈ సందర్భంగా పి. జమలయ్య మాట్లాడుతూ జిల్లాలో సాగు చేసిన పంటల్లో సుమారు 80 శాతం పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులు ఇప్పటికే ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారని, పంట చేతికి వచ్చినా రాకపోయినా సంవత్సరానికి 30 బస్తాల ధాన్యాన్ని కౌలుగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. పంట చేతికి వచ్చే సమయంలో అర్నబ్, మురసు తుఫానుల ప్రభావంతో వరి పంట నేలకొరిగి నీట మునిగిందని, రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో కంకులు మొలకెత్తి, పంట కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ 50 వేల పరిహారం ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం హెక్టారుకు రూ.25 వేల పరిహారం ఇస్తామని ప్రకటించడం ప్రస్తుత సాగు వ్యయాలకు ఏమాత్రం సరిపోదన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, దుక్కి, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రైతులకు కనీసం పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. అందువల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి కనీసం రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
భూయజమానుల అంగీకారాన్ని ఎందుకు..?
పంట నష్టంపై ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో అధికారులు సమగ్రంగా పరిశీలించి నమోదు చేయకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని సమగ్రంగా ఎన్యూమరేషన్ చేయాలని కోరారు. భూయజమానుల అంగీకారం ఉన్నా లేకపోయినా క్షేత్రస్థాయిలో వాస్తవంగా సాగు చేస్తున్న కౌలురైతులను గుర్తించాలని, పరిహారం భూమి యజమానులకు కాకుండా పంట సాగు చేసి నష్టపోయిన కౌలురైతుల బ్యాంకు ఖాతాలకే నేరుగా జమ చేయాలని స్పష్టం చేశారు.
ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా పరిహారం కూడా వాస్తవ సాగుదారులకే అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కౌలురైతులు సాగు చేసిన పంటలకు బీమా పరిహారం అందించేందుకు భూస్వాముల పేర్లతో ఉన్న భూమి రికార్డులను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా, క్షేత్రస్థాయి సాగు వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
కౌలు రద్దు చేయాలి..
జిల్లాలో దేవాలయ భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని జమలయ్య తెలిపారు. ఈ ఏడాది ముందస్తుగా చెల్లించిన కౌలు మొత్తాన్ని తిరిగి ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదా వచ్చే ఏడాది కౌలు చెల్లించకుండా సాగు కొనసాగించేందుకు వెసులుబాటు కల్పించాలని కోరారు. ప్రైవేటు భూయజమానులతో ప్రభుత్వం చర్చించి, పంటలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో కౌలురైతులపై కౌలు భారం పడకుండా కౌలు రద్దు చేయించాలని డిమాండ్ చేశారు.
ఆక్వా రైతులకు ఎకరానికి రూ.లక్ష పరిహారం చెల్లించాలి
వరి పంటతో పాటు కొబ్బరి, ఆక్వా, అరటి, తమలపాకు తోటలు, కూరగాయల పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఆక్వా చెరువుల సాగుదారులు ఇప్పటికే ఎకరానికి రూ.2.50 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారని, తుఫాను గాలులు, వరద ముంపు కారణంగా ఏరియేటర్లు దెబ్బతినడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రోజుల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. రొయ్యలను కాపాడుకునేందుకు డీజిల్ జనరేటర్లపై భారీగా ఖర్చు చేసినప్పటికీ అనేక మంది ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. ఆక్వా చెరువుల సాగుదారులకు ఎకరానికి రూ.లక్ష చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా తుఫానుల ప్రభావంతో రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రభుత్వం తాత్సారం చేయకుండా తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు. పంట నష్టాల ఎన్యూమరేషన్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. ఆనంద్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసి, కొత్త రుణాలు అందించాలని కోరారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కలిశెట్టి వెంకటరావు మాట్లాడుతూ తుఫానుల కారణంగా వ్యవసాయ పనులు నిలిచిపోయి వ్యవసాయ కార్మికులు ఉపాధి, పనిదినాలు కోల్పోయారని తెలిపారు. పనులు కోల్పోయిన వ్యవసాయ కార్మిక కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తుఫానులతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. ముఖ్యంగా భూమి లేకపోయినా అప్పులు చేసి, కౌలు చెల్లించి పంటలు సాగు చేస్తున్న కౌలురైతులకు పరిహారం అందకుండా చేసే భూమి యాజమాన్య ఆధారిత విధానాలను విడనాడాలి. క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాస్తవ సాగుదారులను గుర్తించి, నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా మొత్తాలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని పి. జమలయ్య డిమాండ్ చేశారు.

