పోలవరం పనుల వేగం, నాణ్యతపై పీపీఏ సీఈఓ సంతృప్తి
తుఫాన్ల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన
పోలవరం, నవంబర్ 17: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పనుల నాణ్యత కూడా బాగుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ సంజీవ్ వోహ్రా తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాజెక్టు పనులను సమీక్షించడంతో పాటు క్షేత్రస్థాయిలో నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడికక్కడే వివిధ నిర్మాణ సామగ్రి నాణ్యతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష
పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో పీపీఏ సభ్య కార్యదర్శి ఎం. రఘురామ్, చీఫ్ ఇంజనీర్ ఎం. రమేష్ కుమార్‌తో కలిసి సీఈఓ సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ అధికారులు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని వివరించారు. గత పర్యటనలో తాను చేసిన సూచనలు, విదేశీ నిపుణుల బృందం ఇటీవల ఇచ్చిన సలహాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.

గత నెలలో వచ్చిన తుఫాను, తాజాగా జారీ అవుతున్న తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నందున ప్రస్తుతం ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎన్ని యంత్రాలను వినియోగిస్తున్నారనే వివరాలను కూడా తెలుసుకున్నారు.
నిర్మాణ సామగ్రి నాణ్యతపై క్షేత్రస్థాయి పరిశీలన
సమీక్ష అనంతరం పీపీఏ, జలవనరుల శాఖ, MEIL అధికారులతో కలిసి ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతం, జీ హిల్, జీ డ్యాష్ హిల్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను సంజీవ్ వోహ్రా పరిశీలించారు. నిర్మాణంలో వినియోగిస్తున్న మట్టి, ఇసుక, రాయి, కంకర, కాంక్రీట్ నాణ్యతను స్వయంగా తనిఖీ చేయించారు. పరీక్షల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల వేగంతో పాటు నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిరంతరం నాణ్యతా పరీక్షలు నిర్వహించి, వాటికి సంబంధించిన రికార్డులను భద్రపరచాలని సూచించారు. తుఫాన్ల సమయంలో నిర్మాణ పనులకు నష్టం వాటిల్లకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతిరోజూ నిర్దేశించిన లక్ష్యాలను నాణ్యతతో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ కే. నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ పి. రామచంద్రరావు, నాణ్యత విభాగం సీఈ శేషుబాబు, ఎస్‌ఈ నరసింహరావు, ఈఈలు బాలకృష్ణ, శ్రీనివాస్, ప్రేమ్‌చంద్, MEIL పోలవరం ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ఏ. గంగాధర్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
