ఏపీకి పెట్టుబడుల వెల్లువ

సీఐఐ సదస్సులో రూ.32.49 లక్షల కోట్ల ఒప్పందాలు: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి నూతన దిశను చూపుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రముఖ పారిశ్రామిక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతూ, వేగవంతమైన అనుమతులు, ప్రోత్సాహకాల ద్వారా ‘ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నామన్నారు. సుదీర్ఘ తీరప్రాంతం, నౌకాశ్రయాలు, మానవ వనరుల సామర్థ్యంతో ఐటీ, పునరుత్పాదక ఇంధనం, తయారీ రంగాలతో పాటు ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ, ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు ద్వారా రైతులకు మెరుగైన మార్కెట్, గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
నేటి సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించామని, కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా వాటిని వాస్తవ పరిశ్రమలుగా మార్చి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరగడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
