రాయలసీమపై దారుణ వివక్ష

రాయలసీమను జీరో చేసి నాయకులు హీరోలవుతారా..!
సంస్థలు తరలిపోతున్నా మౌనమా..
దూషణలు ఆపండి..
రాయలసీమ కోసం గళమెత్తండి
బొజ్జ దశరథ రామిరెడ్డి పిలుపు
రాయలసీమకు దక్కాల్సిన పరిపాలనా ప్రాధాన్యతను, కార్యాలయాలను, జాతీయ స్థాయి సంస్థలను సాధించడంలో పాలకులు విఫలమవడమే కాకుండా.. ఇప్పటికే ఏర్పాటైన సంస్థలను కూడా ఒక్కొక్కటిగా తరలిస్తున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా రాయలసీమ రాజకీయ నాయకులు మౌనంగా ఉండటం దురదృష్టకరమన్నారు. ఆంధ్రావని వెబ్ న్యూస్ andhravani.net ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. నంద్యాల సమితి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు వ్యక్తిగత దూషణలు, ఆధిపత్య పోరాటాలతో కాలం గడుపుతూ ప్రాంత భవిష్యత్తును విస్మరిస్తున్నారని విమర్శించారు.
కర్నూలు మానవ హక్కుల కమిషన్‌ను ‘వారానికో ఊరు’ చేస్తారా?
కర్నూలులోని మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు ప్రజలు రావడం దూరమవుతుందనే కారణంతో వారానికో ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. “మీ ఊరి నుంచి మా ఊరు ఎంత దూరమో.. మా ఊరి నుంచి మీ ఊరూ అంతే దూరం!” అన్న ఈ సాధారణ సత్యం ప్రభుత్వానికి తెలియదా? ఇదే సూత్రం రాయలసీమకు ఎందుకు వర్తించదు? అని నిలదీశారు. హైకోర్టు, సచివాలయం, శాసనసభ, కీలక కార్యాలయాలన్నీ సీమ ప్రజలకు దూరమేనని గుర్తుచేశారు.

బడ్జెట్ సమావేశాలు రాయలసీమలో నిర్వహించాలి
శాసనసభ సమావేశాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జరగాలి, బడ్జెట్ సమావేశాలు రాయలసీమలో నిర్వహించాలనీ, సచివాలయ శాఖల కార్యాలయాలు రొటేషన్ పద్ధతిలో కర్నూలులో పనిచేయాలి, అనుబంధ కార్యాలయాలు సీమలో ఏర్పాటు కావాలి.
ప్రకటించిన హైకోర్టును ఇక ఆలస్యం చేయకుండా కర్నూలులో తక్షణమే ఏర్పాటు చేయాలి, రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించి, అక్కడి ప్రభుత్వ ఉద్యోగాల్లో సీమ యువతకు సమాన అవకాశాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
సీమకు దక్కాల్సినవి ఎక్కడికి పోతున్నాయి?
- అనంతపురంలో AIIMS ప్రతిపాదనను పక్కనపెట్టి మంగళగిరిలో ఏర్పాటు
కడప స్టీల్ ప్లాంట్: SAIL ఆధ్వర్యంలో ఏళ్ల తరబడి హామీలతోనే కాలయాపన,
KRMB కార్యాలయం: కర్నూలులో ఏర్పాటు కావాల్సింది, విజయవాడకు తరలించే యత్నం,
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు: కడప నుంచి ప్రధాన కార్యాలయం అమరావతికి తరలింపు,
న్యాయ విశ్వవిద్యాలయం: కర్నూలులో శంకుస్థాపన చేసి, అమరావతికి తరలింపు,
జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ: విభజన చట్టం ప్రకారం సీమకు దక్కాల్సిన సంస్థ కోసం కేంద్రం ఇచ్చిన రూ.135 కోట్లను, గుంటూరు జిల్లా లాంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ భవన నిర్మాణానికి మళ్లింపు
ఈ నిర్ణయాల వెనుక కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు.
వనరులు కావాలి… అభివృద్ధి మాత్రం వద్దా?
“రాయలసీమ కేవలం ముడిసరుకు ఇచ్చే ప్రాంతమా?” ..”రాయలసీమకు ప్రభుత్వ కార్యాలయాలు వద్దు, జాతీయ సంస్థలు వద్దు, సాగునీటి ప్రాజెక్టులు వద్దు, ఉన్న ప్రాజెక్టులకు మరమ్మతులు కూడా వద్దు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి వద్దు… కానీ ఇక్కడి సహజ వనరులు మాత్రం ఇతర ప్రాంతాల అభివృద్ధికి ముడిసరుకుగా కావాలా? నీళ్లు కావాలి! ఎర్రచందనం కావాలి! సౌరశక్తి, పవనశక్తి, ఖనిజ సంపద కావాలి! మరి ఈ వనరులు అందిస్తున్న ప్రాంతానికి అభివృద్ధి ఎందుకు దక్కకూడదు? సీమను సమాన హక్కులున్న భాగస్వామిగా గుర్తించరా?” అని సూటిగా ప్రశ్నించారు. తమకు ప్రత్యేక హక్కులు అక్కర్లేదని, ఇతర ప్రాంతాలకు కల్పిస్తున్న అవకాశాలనే సీమకూ కల్పించాలని కోరారు.
రాయలసీమ నాయకులకు సూటి ప్రశ్న
“మీ ఆధిపత్యమే ముఖ్యమా? సీమ భవిష్యత్తు ముఖ్యం కాదా?”
ఈ పరిణామాలన్నింటికంటే బాధాకరమైనది సీమ నాయకుల వైఖరేనని ఆయన అన్నారు. “రాయలసీమ సమాజాన్ని జీరో చేసి మీరు హీరోలు అవుతారా? ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తకుండా, ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలతో రాజకీయ మైలేజీ పొందాలనుకోవడం సమంజసమా? కార్యాలయాలు తరలిపోతున్నా, సంస్థలు దక్కకపోయినా, ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నా, పరిశ్రమలు రాకపోయినా మీకు పట్టదా?” అని నిలదీశారు.
అన్ని పార్టీల నాయకులు వ్యక్తిగత విమర్శలు మాని, ఉమ్మడి కార్యాచరణతో సమష్టిగా పోరాడాలని హితవు పలికారు. లేనిపక్షంలో సీమ ప్రజల హక్కులను విస్మరించే నాయకులకు తగిన రాజకీయ గుణపాఠం చెప్పే స్థాయికి రాయలసీమ సమాజం ఎదగాలని బొజ్జా పిలుపునిచ్చారు.
