భీమవరం ఆక్వాకల్చర్ క్లస్టర్‌లో హోల్ ఫిష్ కాన్సెప్ట్

  • భీమవరం ఆక్వా రంగానికి ఐస్‌లాండ్ సాంకేతిక సహకారం
  • చేపలు, రొయ్యల వ్యర్థాల నుంచి విలువైన ఉత్పత్తుల తయారీకి ప్రణాళిక..
  • సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా ఆక్వాకల్చర్ క్లస్టర్ అభివృద్ధి లక్ష్యం

భీమవరం, నవంబర్ 19: చేపలు, రొయ్యల ప్రాసెసింగ్ వ్యర్థాలను సైతం విలువైన వాణిజ్య ఉత్పత్తులుగా మార్చి ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఐస్‌లాండ్ సాంకేతిక సహకారం అందించనుంది. ఐస్‌లాండ్‌లో విజయవంతంగా అమలవుతున్న నూరు శాతం చేపల వినియోగ విధానం (హోల్ ఫిష్ కాన్సెప్ట్)ను భీమవరం ఆక్వాకల్చర్ క్లస్టర్‌లో అమలు చేసే అవకాశాలపై చర్చించారు.

వ్యర్థాల నుంచి విలువైన ఉత్పత్తులు

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశానికి ఐస్‌లాండ్ ఓషన్ క్లస్టర్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ థోర్ సిగ్‌ఫుస్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేపలు, రొయ్యల ప్రతి భాగాన్ని వినియోగించి అధిక విలువ కలిగిన ఉత్పత్తులు తయారు చేసే విధానాలు, ఆధునిక సాంకేతికతపై వివరించారు.

చేపల తొక్కలు, తలలు, ఎముకలు, అంతర్గత భాగాల వంటి ఉప ఉత్పత్తులను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి అదనపు ఆదాయం పొందవచ్చని థోర్ సిగ్‌ఫుస్సన్ తెలిపారు. ఈ విధానం ద్వారా వ్యర్థాలను తగ్గించడంతో పాటు పరిశ్రమలకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఐస్ లాండ్ ప్రతినిధులు
సమావేశంలో మాట్లాడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఐస్ లాండ్ ప్రతినిధులు

భీమవరం ఆక్వా క్లస్టర్ అభివృద్ధికి ప్రణాళిక

భీమవరం ఆక్వాకల్చర్ క్లస్టర్‌ను సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. జిల్లాలో 26 సీఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, 30 ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లు, నాలుగు పీలింగ్ షెడ్లు, నాలుగు రీసైక్లింగ్ యూనిట్లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని సంస్థలు వ్యర్థాల నుంచి కైటిన్, కైటోసాన్, రొయ్యల తల పొడి వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాయన్నారు.

ఆరు కీలక రంగాల్లో సహకారం

వ్యర్థాల సేకరణ, వేరు చేయడం, ప్రాసెసింగ్, పరిశోధన, సాంకేతిక శిక్షణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, బ్రాండింగ్, ప్యాకేజింగ్, ఎగుమతులు తదితర అంశాల్లో ఐస్‌లాండ్ ఓషన్ క్లస్టర్ సహకారంపై సమావేశంలో చర్చించారు. ఈ భాగస్వామ్యంతో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.సమావేశంలో ఫిషరీస్ కమిషనర్ రమశంకర నాయక్, డీఆర్ఓ పి.గ్లోరీ, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share this:
andhraprdeshaquaculturewest godavari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *