విశాఖలో సినిమా, క్రియేటర్ ఎకానమీ

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏపీ అభివృద్ధికి గేట్‌వే: మంత్రి నారా లోకేష్

రానా దగ్గుబాటితో లోకేష్ పాడ్ కాస్ట్

విశాఖపట్నం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గేట్‌వేగా నిలుస్తుందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో నటుడు రానా దగ్గుబాటి నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఆయన పాల్గొన్నారు.

రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో ముందుకెళ్తోందని, విశాఖను ఆర్థిక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. అమరావతిలో దేశంలోనే తొలి 156 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

విశాఖలో ఐటీ, డేటా సెంటర్లు, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం సుమారు 17 స్టార్ హోటళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. అరకు కాఫీ, ఆలయ పర్యాటకం, బ్లూ ఫ్లాగ్ బీచ్‌లను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తామన్నారు.

విశాఖపట్నం సీఐఐ సమ్మిట్ లో దగ్గుబాటి రానా
సీఐఐ సమ్మిట్ లో లోకేష్ తో కలిసి పాల్గొన్న దగ్గుబాటి రానా

సినిమా, యూట్యూబ్, గేమింగ్, యానిమేషన్ వంటి రంగాలతో క్రియేటర్ ఎకానమీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. విశాఖలో సినిమా నిర్మాణానికి అవసరమైన సదుపాయాల కల్పనపై రానా దగ్గుబాటితో కలిసి ప్రణాళిక రూపొందించాలని ప్రతిపాదించారు. దీనికి స్పందించిన రానా, ఏడాదిలో విశాఖలో తమ సంస్థ తరఫున సినీ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

యువత రాజకీయాల్లోకి రావాలని, వ్యవస్థలోని సమస్యలను విమర్శించడమే కాకుండా పరిష్కారాల్లో భాగస్వాములు కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. వైఫల్యాలను ఎదుగుదలలో భాగంగా స్వీకరించి, కొత్త ఆలోచనలతో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

సినిమా, సంగీతం, యానిమేషన్, గేమింగ్ రంగాల్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. థమన్ వంటి సంగీత రంగ ప్రముఖుల సహకారంతో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక, సాంస్కృతిక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని రానా దగ్గుబాటి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సినిమా, ఇతర సృజనాత్మక రంగాల అభివృద్ధికి పనిచేస్తానని చెప్పారు.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *