పారిశ్రామిక అభివృద్ధికి నీటి భద్రత కీలకం
రాష్ట్ర రిజర్వాయర్ నిల్వల్లో 10 శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తున్నాం.
నీటి సంరక్షణ, స్మార్ట్ ఇరిగేషన్, నీటి శుద్ధి, రీసైక్లింగ్, డిజిటల్ వాటర్ మేనేజ్‌మెంట్‌లో పరిశ్రమలు భాగస్వాములు కావాలి.
ప్రభుత్వంతో కలిసి వినూత్న జలవనరుల పరిష్కారాలను అభివృద్ధి చేయాలని పారిశ్రామిక సమాఖ్యకు మంత్రి పిలుపు.
-రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన జలవనరులు, అద్భుతమైన భౌగోళిక అనుకూలతలు ఉన్నాయని, ఈ జలవనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ కరువు రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన CII సదస్సులో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి, నదుల అనుసంధానం, సాగు మరియు పారిశ్రామిక అవసరాలకు నీటి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, రాష్ట్రంలో 5 ప్రధాన నదులు, 35 మధ్య తరహా, చిన్న నదులు, 114 ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లు, 38 వేలకు పైగా చిన్న నీటిపారుదల చెరువులు, 19 లక్షలకు పైగా వ్యవసాయ బోరుబావులు ఉన్నాయని తెలిపారు. ఈ అపారమైన జలసంపదను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు.
నదుల అనుసంధానమే కరువు నివారణకు పరిష్కారం
మిగులు జలాలున్న ప్రాంతాల నుంచి కరువు పీడిత ప్రాంతాలకు నీటిని తరలించేందుకు నదుల అనుసంధానాన్ని తమ ప్రభుత్వం ప్రధాన వ్యూహంగా అమలు చేస్తోందని మంత్రి నిమ్మల తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కె.ఎల్. రావు నదుల అనుసంధానానికి ఆద్యులని, కరువు రహిత భారతదేశం కోసం ఆయన ప్రతిపాదించిన నదుల అనుసంధాన ఆలోచనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శ్రీకారం చుట్టగా, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని వివరించారు.
పట్టిసీమతో రూ.లక్ష కోట్లకు పైగా సంపద సృష్టి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం సాకారమైందని మంత్రి నిమ్మల తెలిపారు. సుమారు రూ.1,600 కోట్ల వ్యయంతో రికార్డు సమయంలో పూర్తయిన ఈ ప్రాజెక్టు గత 12 సంవత్సరాల్లో కృష్ణా డెల్టాలో వ్యవసాయం, ఆక్వాకల్చర్‌ను కాపాడటంతో పాటు రూ.లక్ష కోట్లకు పైగా సంపద సృష్టికి దోహదపడిందన్నారు. ఇప్పటివరకు క్లిష్ట సమయాల్లో 500 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా నదీ వ్యవస్థకు తరలించామని, ఎల్‌నినో వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ కృష్ణా డెల్టాకు నీటి భద్రత కల్పించామని వివరించారు.

హంద్రీ–నీవాతో రాయలసీమకు జలభరోసా
రాయలసీమ జీవనాడి హంద్రీ–నీవా మొదటి దశ దేశంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 738 కిలోమీటర్ల దూరం, 751 మీటర్ల ఎత్తుకు 72 లిఫ్ట్‌ల ద్వారా నీటిని తరలించే ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణతో కేవలం ఏడాది రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7 కరువు పీడిత జిల్లాలకు నీరందించడంతో పాటు 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించనున్నామని తెలిపారు. కియా సహా రాయలసీమలోని పారిశ్రామిక క్లస్టర్లకు కూడా నీటి భద్రత కల్పించనున్నామని పేర్కొన్నారు.

