రబీ ఎరువుల సబ్సిడీ..భారమా,లాభమా..!
రబీ 2026-27 సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎరువుల సబ్సిడీ, దాని అసలు వాస్తవాలపై ఆంధప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
రబీ 2026–27 ఎరువుల సబ్సిడీ – ప్రకటనల ఘనతా? లేక వాస్తవ భారామా?
కేంద్ర ప్రభుత్వం రబీ 2026–27 సీజన్‌కు ఫాస్ఫాటిక్, పొటాషిక్ (P&K) ఎరువుల కోసం రూ.62,370.02 కోట్ల సబ్సిడీని ప్రకటించింది. ఇది గత ఏడాది కంటే 64 శాతం ఎక్కువని ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీని వెనుక ఉన్న ఆర్థిక వాస్తవాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిశీలించాల్సిన అవసరం ఉంది.
1. బడ్జెట్ కేటాయింపులు – వాస్తవ లెక్కలు
-
2026–27 వార్షిక బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీకి రూ.1,70,799 కోట్లు కేటాయించారు.
-
సెప్టెంబర్ నాటికే NBS సబ్సిడీ కింద రూ.33,664 కోట్లకు పైగా ఖర్చయ్యాయి.
-
రబీ సీజన్‌కోసం ప్రకటించిన రూ.62,370 కోట్లు పూర్తిగా కొత్త నిధులా లేక సర్దుబాటు కేటాయింపులా అనేదానిపై కేంద్రం పారదర్శకత ప్రదర్శించాలి.
2. డీఏపీ ధర స్థిరత్వం – పెరిగిన ఇతర ఎరువుల ధరలు
-
డీఏపీ 50 కిలోల బస్తా ధర రూ.1,350 వద్దే కొనసాగుతున్నప్పటికీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు (16-20-0-13, 12-32-16 మొదలైనవి) బస్తాకు రూ.300 నుంచి రూ.600 వరకు పెరిగాయి.
-
మిర్చి, పత్తి, వరి సాగు చేసే రైతులకు ఇది అదనపు ఆర్థిక భారంగా మారుతోంది.
3. కౌలురైతులు ఎదురుచూస్తున్న కష్టాలు – యాప్‌ల సమస్యలు
-
డిజిటల్ యాప్‌లు, ఆన్‌లైన్ వెరిఫికేషన్ల వల్ల క్షేత్రస్థాయిలో వాస్తవ సాగు చేస్తున్న కౌలురైతులకు ఎరువులు అందడం గగనమవుతోంది.
-
ప్రభుత్వ సబ్సిడీ ఫలాలు భూమి యజమానులకే పరిమితం కావడంతో, కౌలురైతులు బ్లాక్ మార్కెట్‌లో యూరియా బస్తా రూ.600కు, డీఏపీ రూ.1,950 దాకా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

ప్రభుత్వం తక్షణమే చేపట్టాల్సిన చర్యలు:
-
ధరల నియంత్రణ: అన్ని రకాల ఎరువులను రైతులకు అందుబాటు ధరల్లో అందించాలి.
-
బ్లాక్ మార్కెట్ కట్టడి: కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-
యాప్ సమస్యల పరిష్కారం: డిజిటల్ విధానాల పేరుతో ఏ ఒక్క నిజమైన రైతుకూ ఎరువులు నిరాకరించకూడదు.
-
కౌలురైతులకు గుర్తింపు: భూమి యాజమాన్యంతో సంబంధం లేకుండా వాస్తవ సాగుదారులందరికీ సబ్సిడీలు, రుణాలు అందేలా చట్టపరమైన భరోసా కల్పించాలి.
రైతులకు కావాల్సింది కేవలం ప్రకటనలు కాదు; పెరుగుతున్న పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి, గిట్టుబాటు ధరలు కల్పించే సమగ్ర విధానాలు!
— పి. జమలయ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం


